
BWF ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్‌లో టీమిండియా స్టార్ ద్వయం చిరాగ్ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి జపాన్‌కు చెందిన యుగో కొబయాషి, టకురో హోకిని 24-22, 15-21, 21-14 తేడాతో ఓడించారు. ఈ నెల ప్రారంభంలో బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న వీరిద్దరు తమ ఫామ్ వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో అప్రతిహతంగా కొనసాగిస్తున్నారు. జపాన్ వరల్డ్ నంబర్ 2 జోడీపై వీరిద్దరు గెలుపొందడంతో వీరి సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే తొలి మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠతో సాగింది. ఇరు వైపులా విజయం దోబూచులాడింది.
ఇక స్కోర్‌లైన్‌ను 22-22గా ఉన్నప్పుడు చిరాగ్ మిడ్‌కోర్ట్ నుంచి క్రాస్ ఆడి పాయింట్ సాధించడంతో తొలి గేమ్ భారత్ వశమైంది.
రెండో గేమ్‌లో వీరు కాస్త వెనకబడ్డారు. స్కోర్‌కార్డు 11-9 రీడింగ్‌తో ఉన్నప్పుడు ఇంకా పుంజుకునే అవకాశాలున్నా.. జపాన్ జోడీ ఎటాకింగ్ గేమ్ ఆడి గెలుపొందింది. దీంతో మ్యాచ్ 1-1తో సమమైంది. భారత్ మూడో గేమ్ మ్యాచ్ డిసైడర్ అయింది. మూడో గేమ్‌లో భీకరంగా పుంజుకున్న సాత్విక్, చిరాగ్ ప్రత్యర్థికి పుంజుకునే అవకాశమే ఇవ్వలేదు. దీంతో ఈ గేమ్ గెలుపొందిన భారత జోడీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం ఖాయం చేసుకుంది. తద్వారా వీరిద్దరు చరిత్ర కూడా నెలకొల్పారు. పురుషుల డబుల్స్‌లో వరల్డ్ ఛాంపియన్ షిప్లో భారతదేశానికి ఇదే తొలి పతకం. ఇక సెమీస్లో మనవాళ్లు చెలరేగే అవకాశం లేకపోలేదు.
గతేడాది టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల డబుల్స్‌లో గ్రూప్ స్టేజ్‌లోనే వెనుదిరిగిన ఈ జోడీ.. ఎక్కడ ఓడారో అక్కడే మళ్లీ పతకం అందుకోనున్నారు. ఈ జంట 2022లో ఇండియా ఓపెన్‌ను గెలుచుకుని ఈ సీజన్‌ను ఘనంగా ప్రారంభించారు. ఆ తర్వాత వీరు పాల్గొన్న ప్రతి టోర్నీలోనూ హవా చూపిస్తూ వచ్చారు. ఈ యువ జంట ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్‌లో క్వార్టర్-ఫైనల్‌కు చేరుకుంది. అలాగే చారిత్రాత్మక థామస్ కప్ స్వర్ణ పతకాన్ని భారత్ సాధించడంలో వీరు కీలకపాత్ర పోషించారు.