
హైదరాబాద్: ఫుజోహు వేదికగా జరుగుతున్న చైనా ఓపెన్ సూపర్ సిరిస్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌లో చైనా క్రీడాకారిణి హన్ యుయిపై 21-15, 21-13 తేడాతో విజయం సాధించింది.
17 ఏళ్ల హన్... సింధుతో తలపడటం ఇదే తొలిసారి అయినప్పటికీ గట్టి పోటీ ఇచ్చింది. ఒకానొక దశలో హన్ 5-6తో ముందజ వేసింది. ఆ తర్వాత సింధు తన అనుభవాన్ని ఉపయోగించి హన్‌పై ఆధిపత్యం చెలాయించింది. ఈ మ్యాచ్‌లో సింధు తప్పిదాలు చేసినప్పటికీ.. చివర్లో పుంజుకుని క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది.
క్వార్టర్స్‌లో చైనాకు చెందిన గాయో ఫంజీతో సింధు తలపడనుంది. ఇదిలా ఉంటే చైనా ఓపెన్ నుంచి ఇప్పటికే హెచ్ఎస్ ప్రణయ్, సైనా నెహ్వాల్ నిష్క్రమించగా.. సింధు మాత్రమే క్వార్టర్ ఫైనల్ చేరింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో సైనా నెహ్వాల్ జపాన్‌కు చెందిన ఐదో సీడ్ యమగూచి చేతిలో 18-21, 11-21 ఓటమిపాలైంది.
37 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సైనా ఏ దశలోనూ మయగూచికి పోటీ ఇవ్వలేకపోయింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో హాంకాంగ్‌కు చెందిన యు లీ చేతిలో భారత్‌కు చెందిన హెచ్ఎస్ ప్రణయ్ 19-21, 17-21తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు. గాయం కారణంగా ఈ టోర్నీకి కిడాంబి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.