
హైదరాబాద్: చాంగ్‌జౌ వేదికగా జరుగుతున్న చైనా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ టైటిల్ సాధించే దిశగా దూసుకెళుతున్నారు. ఈ ఇద్దరూ తమ విభాగాల్లో చైనా ఓపెన్ క్వార్టర్ ఫైనల్ చేరుకున్నారు.
మహిళల సింగిల్స్ రెండోరౌండ్లో మూడోసీడ్ సింధు 21-23, 21-13, 21-18తో థాయ్‌లాండ్ షట్లర్ బుసానన్ ఓన్‌గాబరుగ్‌ఫాన్‌పై విజయం సాధించింది. గంటా తొమ్మిది నిమిషాల పాటు సాగిన ఉత్కంఠభరిత పోరులో ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న సింధు... తొలి గేమ్‌లో ఓడి, ఆ తర్వాత రెండు గేములను కైవసం చేసుకొంది.
సెమీఫైనల్ బెర్త్ కోసం చైనాకు చెందిన ఆరోసీడ్ చెన్ యుఫీతో సింధు అమీతుమీ తేల్చుకోనుంది. ఇక, పురుషుల సింగిల్స్‌లోనూ ఏడో సీడ్ కిదాంబి శ్రీకాంత్ చెమటోడ్చాల్సి వచ్చింది. హోరాహోరీ పోరులో శ్రీకాంత్ 21-12, 15-21, 24-22తో సుపన్యు అవిహిన్‌గ్సాన్ (థాయ్‌లాండ్)పై అతికష్టమ్మీద గెలుపొందాడు.
కిదాంబి తొలి గేమ్ గెలవగా ప్రత్యర్థి రెండో గేమ్ కైవసం చేసుకోవడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. చివరి గేమ్‌లో ఇద్దరూ నువ్వానేనా అన్నట్టు తలపడ్డారు. చివరికి శ్రీకాంత్ తన అనుభవాన్ని ఉపయోగించి సుపన్యు అవిహిన్‌గ్సాన్‌పై విజయం సాధించాడు. క్వార్టర్స్‌లో జపాన్ సంచలన ఆటగాడు, మూడోసీడ్ కెంటో మొమొటాతో శ్రీకాంత్ తలపడనున్నాడు.
డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో భారత పోరు ముగిసింది. పురుషుల డబుల్స్ ప్రీక్వార్టర్స్‌లో భారత జంట సుమిత్-మను అత్రి 9-21, 10-21తో చెన్-వాంగ్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో ఓడగా.. మిక్స్‌డ్ రెండోరౌండ్లో సాత్విక్-అశ్వినీ ద్వయం 14-21, 11-21తో టాప్‌సీడ్ సీ జెంగ్-హువాంగ్ (చైనా) చేతిలో, ప్రణవ్-సిక్కి రెడ్డి జంట 16-21, 10-21తో డెన్మార్క్ జోడీ క్రిస్టీనా-మథియాస్ చేతిలో పరాజయం పాలైంది.