హైదరాబాద్: రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో పతకాన్ని ఖాయం చేసిన బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధుకు ఖరీదైన కానుక లభించనుంది. గురువారం రాత్రి రియోలో బాడ్మింటన్ సింగిల్స్ సెమీ ఫైనల్‌లో జవరల్డ్ 10వ ర్యాంక్‌లో సిందు 21-19, 21-10తో ప్రపంచ 6వ ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్)ను ఓడించి సింధు ఫైనల్ చేరి, పతకాన్ని ఖరారు చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో సింధు విజయం సాధించిన వెంటనే అక్కడే ఉన్న హైదరాబాద్ డిస్ట్రిక్ట్ బాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్‌లో ముంబై మాస్టర్స్ ఫ్రాంచైజీ సహ యజమానిగా వ్యవహరిస్తున్న చాముండేశ్వరీనాథ్ ఆమెకు ఖరీదైన గిప్ట్‌ను ప్రకటించారు.

తెలుగు రాష్ట్రాల నుంచి రియో ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులు ఎవరైనా సరే పతకం సాధిస్తే వారికి బహుమతిగా బీఎండబ్ల్యు కారుని ఇస్తానని ఆయన గతంలోనే ప్రకటించారు. తాను చెప్పిన మాటకు కట్టుబడి రియోలో భారత్‌కు మరో పతకాన్ని ఖరారు చేసిన సింధుకు రూ.60 లక్షల విలువ చేసే బీఎండబ్ల్యూ కారును బహుమతిగా ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు.
ఫోటో గ్యాలరీ : రియో దాకా సింధు
రియో ఒలింపిక్స్ నుంచి ఈ నెల 28న పీవీ సింధు హైదరాబాద్‌కు చేరుకుంటుందని చెప్పిన ఆయన ఆ మరుసటి రోజు ఘనంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్లాన్ చేసినట్లు చెప్పారు. బీఎండబ్ల్యూ కారును బహుమతిగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చేతుల మీదగా సింధుకు అందజేయనున్నారు.
స్వర్ణం మనదే అంటున్న గోపిచంద్ అకాడమీ ఆటగాళ్లు
రియో ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్‌లో భారత్‌కు స్వర్ణం వస్తుందని గోపీచంద్ అకాడమీ ఆటగాళ్లు పేర్కొంటున్నారు. ఫైనల్లో సింధుతో తలపడనున్న స్పెయిన్ క్రీడాకారిణి కెరలీనా మారన్‌ను సింధు గతంలో మూడుసార్లు ఓడించిందని వారు పేర్కొంటున్నారు.
ఆమెపై ఎలా ఆడాలో సింధుకు తెలుసని, గతంలో ఆమెపై ఆడిన, ఓడించిన అనుభవం సింధుకు ఉండడంతో స్వర్ణం తప్పక సాధిస్తుందని అంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఆమెపై విజయాన్ని సింధు సాధించడంతో మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.