
హైదరాబాద్: చైనాలోని గ్వాంగ్జౌ వేదికగా జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఫైనల్‌కు చేరింది. శనివారం జరిగిన సెమీస్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన రచనోక్ ఇంతనోన్‌పై 21-16, 25-23తో సింధు విజయం సాధించింది.
తాజా విజయంతో పీవీ సింధు మరో పతకాన్ని తన ఖాతాలో వేసుకోనుంది. సుమారు 54 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్ నుంచే సింధు దూకుడు ప్రదర్శించింది. తొలి గేమ్‌ను కేవలం 20 నిమిషాల్లోనే సింధు సొంతం చేసుకున్నప్పటికీ... రెండో గేమ్‌లో రచనోక్ గట్టి పోటీ ఇచ్చింది.
దీంతో రెండో గేమ్ గేమ్ టై బ్రేకర్ వరకు వెళ్లింది. హోరాహోరీగా సాగిన టై బ్రేకర్‌ను సింధు 25-23తో కైవసం చేసుకుని గేమ్‌తో పాటు మ్యాచ్‌ని కూడా సొంతం చేసుకుంది. ఆదివారం జరిగే ఫైనల్లో పీవీ సింధు జపాన్ ప్లేయర్ నోజోమీ ఒకుహరాతో తలపడుతుంది. ఈ టోర్నీలో సింధు వరుసగా ఇది నాలుగో విజయం కావడం విశేషం.
గతేడాది కూడా ఈ ఇద్దరి మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో ఒకుహరా విజయం సాధించింది. మళ్లీ ఇప్పుడు ఒకుహరాతోనే ఫైనల్ మ్యాచ్ జరుగుతుండటంతో సింధు ప్రతీకారం తీర్చుకుంటుందో లేదో చూడాలి. కాగా, శుక్రవారం జరిగిన గ్రూప్ చివరి మ్యాచ్‌లో ప్రపంచ 12వ ర్యాంకర్ బీవెన్ జాంగ్‌పై విజయం సాధించి సెమీస్‌కు చేరిన సంగతి తెలిసిందే.