బాల్ బ్యాడ్మింటన్ దిగ్గజం అర్జున పిచ్చయ్య కన్నుమూత

బాల్ బ్యాడ్మింటన్ దిగ్గజం, తెలుగు క్రీడాకారుడు అర్జున పిచ్చయ్య ఇకలేరు. ఆయన వయసు 104 సంవత్సరాలు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. తెలంగాణలోని హనుమకొండ జిల్లాలో గల ధర్మసాగర్ మండలం రాంపూర్‌లో ఉన్న తన మనవడి ఇంట్లో కన్నుమూశారు. కాగా ఆయన భార్య సత్యవతి 2007లో మరణించారు. 1918లో ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో గల కూచిపూడి గ్రామంలో డిసెంబర్ 21న జన్మించిన అర్జున పిచ్చయ్య అసలు పేరు జమ్మలమడక పిచ్చయ్య.
అయితే ఆయనకు అర్జున రావడంతో అర్జున పిచ్చయ్యకు పేరు మారిపోయింది. ఈ నెల 21నే 104వ పుట్టిన రోజు వేడుకలు జరపుకున్నారు అర్జున పిచ్చయ్య. ఈ వేడుకలో పలువురు క్రీడా ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

పిచ్చయ్య బాల్యం, విద్యాభ్యాసం
పిచ్చయ్య బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం అంతా కృష్ణా జిల్లాలోని బందరులోనే పూర్తి అయింది. క్రీడలపై ఉన్న మక్కువతో పదవ తరగతి పాస్ కాలేకపోయారు. నిజానికి పిచ్చయ్య ఫుట్ బాల్ ఎక్కువగా ఆడేవారు. ఆయనకు 15 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఫుట్‌బాల్‌నే ఆడారు. అయితే అప్పుడు అన్నయ్య నారాయణరావు ఇచ్చిన సలహాతో బాల్ బ్యాడ్మింటన్ ఆడడం ప్రారంభించారు. క్రమక్రమంగా బాల్ బ్యాడ్మింటన్‌లో ఉన్నత శిఖరాలను చేరుకున్నారు. 1947లో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సంపాదించారు. ఉద్యోగం నిమిత్తం వరంగల్ వచ్చి ఇక్కడే స్థిరపడిపోయారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు.

అర్జున పిచ్చయ్య విజయాలు
బాల్ బ్యాడ్మింటన్‌లో పిచ్చయ్య కెరీర్ 1951లో మలుపు తిరిగింది. అప్పటి ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో జరిగిన బాల్ బ్యాడ్మింటన్ రాష్ట్రస్థాయి పోటీలో గెలిచి ప్రథమ స్థానంలో నిలిచారు. అంతకుముందు 1935-36లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలో కూడా విజేతగా నిలిచారు. దాంతో పిచ్చయ్య మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. 1955-1970ల మధ్య జరిగిన జాతీయ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లలో 14 సార్లు పాల్గొన్నారు.
అందులో హైదరాబాద్ తరఫున 5, ఆంధ్రప్రదేశ్ తరఫున 9 సార్లు జాతీయస్థాయి పోటీల్లో ఆడారు. ఇక పాల్గొన్న అన్ని సార్లు ఆయనే కెప్టెన్‌గా ఉండడం విశేషం. అందులో ఏకంగా తొమ్మిది సార్లు విజేతగా నిలిచి తెలుగోడి సత్తా చాటారు. మూడు సార్లు రన్నరఫ్‌గా కూడా నిలిచారు. అంతేకాకుండా జిల్లా, రాష్ట్రస్థాయిల్లో 1938-1970 మధ్య పిచ్చయ్య 1400 టోర్నమెంట్లలో పాల్గొనడం విశేషం.

పిచ్చయ్య పొందిన అవార్డులు
పిచ్చయ్య 1970లో అర్జున అవార్డునకు ఎంపికయ్యారు. 1972లో అప్పటి రాష్ట్రపతి అయినా వీవీ గిరి చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. 1978లో అప్పటి ఏపీ సీఎం టి. అంజయ్య రవీంద్ర భారతిలో పిచ్చయ్యను ఘనంగా సన్మానించారు. ఎన్‌టీఆర్ రాష్ట్ర క్రీడా పురస్కారాన్ని 1997లో అప్పటి సీఎం నారా చంద్రబాబునాయడు చేతుల మీదుకు అందుకున్నారు. 1958లో మధురై టోర్నీ నిర్వాహకులు పిచ్చయ్యకు 'బాల్ బ్యాడ్మింటన్ మాంత్రికుడు' అనే బిరుదును ప్రదానం చేశారు. 'స్టార్ ఆఫ్ ఇండియా' అనే బిరుదును కూడా అదే మధురై టోర్నీ నిర్వాహకులు 1966లో ప్రదానం చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications