న్యూఢిల్లీ: తెలుగు తేజం పీవి సింధుకి బ్యాట్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రూ.10లక్షల నగదు బహుమతి ప్రకటించింది. ఆదివారం మకావ్‌లో జరిగిన బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొన్న సింధు మకావ్ ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ టోర్నమెంట్ టైటిల్‌ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆమెకు ఈ బహుమతి ప్రకటించినట్లు బ్యాడ్మింటన్ అసోసియేషన్ పేర్కొంది. ఈ సందర్భంగా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అఖిలేష్ దాస్ గుప్త మాట్లాడుతూ మకావ్ టైటిల్ గెలిచి సింధు తమను మరోసారి గర్వపడేలా చేసిందన్నారు.

అంతర్జాతీయ స్థాయిలో తన సత్త ఎంటో చాటుకుందన్నారు. మకావ్ టైటిల్‌తో పీవీ సింధు బ్యాడ్మింటన్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 12వ స్థానానికి చేరుకుంది. వరుసగా మూడోసారి మకావ్ టైటిల్‌ను సొంతం చేసుకుని సరికొత్త రికార్డు నమోదు చేసింది.
మకావ్ ఓపెన్ 2013, 2014లలో విజేతగా నిలిచిన సింధు వరుసగా ఆదివారం నాడు 2015 టైటిల్‌ను కూడా గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇటీవల జరిగిన డెన్మార్క్ సూపర్ సిరీస్‌లో ఫైనల్ కు చేరడమే కాకుండా, తాజాగా మాకావ్ టైటిల్‌ను సొంతం చేసుకుని మంచి ఊపు మీద ఉన్న పీవి. సింధు మరో టైటిల్ వేటకు సన్నద్ధమవుతోంది.
డిసెంబర్ 1 వ తేదీ నుంచి ఆరంభం కానున్న ఇండోనేషియా మాస్టర్స్ గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నమెంట్ లో కూడా తన జైత్రయాత్రను కొనసాగిస్తానని సింధు ధీమా వ్యక్తం చేస్తోంది.
' మకావ్ ఓపెన్ టైటిల్ వరుసగా మూడు సార్లు (2013,14,15) గెలవడం ఆనందంగా ఉంది. నిజంగా మరోసారి మకావు ఓపెన్ గెలవడం చాలా గొప్పగా ఉంది. నా తదుపరి టార్గెట్ ఇండోనేషియా మాస్టర్స్ గ్రాండ్ ప్రి' అని సింధు పేర్కొంది.