హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణెను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించాలని భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) నిర్ణయించింది. భారత బ్యాడ్మింటన్‌కు విశేష సేవలందించినందుకు గాను పదుకొణెకు ఈ అవార్డు దక్కనుంది. బాయ్ ఈ 'లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్' అవార్డుకు ఇవ్వడం ఇదే తొలిసారి.
ఈ అవార్డు కింద పదుకొణెకి రూ.10 లక్షలతో పాటు ప్రశంసాపత్రం ఇవ్వనున్నట్లు బాయ్ అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మ సోమవారం చెప్పారు. దీనిపై బాయ్ అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మ సోమవారం మీడియా మాట్లాడుతూ 'కొత్తగా ప్రవేశపెట్టిన ఈ అవార్డు కింద రూ. 10 లక్షల నగదు బహుమతి, జ్ఞాపిక అందజేస్తాం' అని అన్నారు.

'బ్యాడ్మింటన్‌లో విశేష సేవలందించిన వారికి ప్రతీ ఏడాది ఈ అవార్డు ఇస్తాం. బెంగళూరులో జరిగిన గత ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లోనే దీనికి సంబంధించిన నిర్ణయం తీసుకున్నాం. తొలి అవార్డును పడుకోన్‌కు ఇవ్వాలని కోర్ కమిటీ ప్రతిపాదించింది' అని ఆయన తెలిపారు.
1980లో ప్రకాశ్ ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సాధించారు. 1983లో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం, 1978 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం గెలిచారు. భారత బ్యాడ్మింటన్‌లో ఆయన అందించిన సేవలకు గాను
కేంద్ర ప్రభుత్వం 1972లో 'అర్జున', 1982లో 'పద్మశ్రీ' పురస్కారాలను అందించింది.