కిదాంబి శ్రీకాంత్‌కు బాయ్ రూ.5 లక్షలు: ఆనంద్ మహీంద్ర ఏమన్నాడో తెలుసా?
హైదరాబాద్: ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన ఫైనల్లో ప్రపంచ 11వ ర్యాంకర్ శ్రీకాంత్ 22-20, 21-16తో వరుస గేముల్లో ఒలింపిక్ చాంపియన్ చెన్‌లాంగ్‌పై విజయం సాధించాడు.
ఇటీవలే ఇండోనేషియా సూపర్ సిరీస్ ప్రిమియర్ గెలిచిన అతడికిది వరుసగా రెండో టైటిల్ కావడం విశేషం. 46 నిమిషాల ఏకపక్ష పోరులో ఆరో ర్యాంకర్ చెన్‌లాంగ్ భారత షట్లర్‌కు ఏమాత్రం గట్టి పోటీ ఇవ్వలేకపోయాడు. గతంలో తలపడిన ఐదుసార్లూ శ్రీకాంత్‌ను ఓడించిన చెన్‌లాంగ్.. ఈసారి మాత్రం భారత షట్లర్ ఎటాకింగ్ గేమ్ ముందు తలొంచాడు.
ఇదిలా ఉంటే మొత్తంగా శ్రీకాంత్‌కు కెరీర్‌లో ఇది నాలుగో సూపర్ సిరీస్ టైటిల్ కావడం విశేషం. అలాగే వరుసగా మూడు సూపర్ సిరీస్ (సింగపూర్, ఇండోనేసియా, ఆస్ట్రేలియన్ ఓపెన్) ఫైనల్స్ ఆడిన ఐదో క్రీడాకారుడిగా కిదాంబి శ్రీకాంత్ చరిత్ర సృష్టించాడు. మ్యాచ్ అనంతరం శ్రీకాంత్ మట్లాడాడు.
'ఆస్ట్రేలియాలో అడుగుపెట్టినపుడు.. డయేరియాతో ఇబ్బందిపడ్డాను. శారీరకంగా ఫిట్‌గా లేను. కానీ ఈ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేశాను. గెలుపోటముల గురించి ఆలోచించకుండా ఆటను ఆస్వాదించేందుకు ప్రయత్నించాను. ఫైనల్లో ఆరం భం నుంచే దూకుడుగా ఆడేందుకు పరిస్థితులు అనుకూలించలేదు' అని అన్నాడు.
'అయితే మ్యాచ్ ఆసాంతం నేనే ఆధిక్యంలో కొనసాగాను. కోచ్ కూడా ఇదే తరహాలో సాగిపొమ్మంటూ సలహా ఇచ్చాడు. పొరపాట్లకు చోటి వ్వకుండా వీలు చిక్కినపుడల్లా ఎటాకింగ్ గేమ్ ఆడడం కలిసొచ్చింది. సుదీర్మన్ కప్ తర్వాతి నుంచి నా ప్రదర్శన చాలా మెరుగైంది. ఫిట్‌నెస్ కూడా బాగుంది. అందుకు నా ఫిజియోకు కృతజ్ఞతలు' అని శ్రీకాంత్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

బాయ్ 5 లక్షల నజరానా
ఇండోనేషియా ఓపెన్ గెలిచినప్పుడు శ్రీకాంత్‌కు రూ. 5 లక్షల నజరానా ఇచ్చిన భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్).. ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలవడంతో మరో రూ. 5 లక్షల నజరానా ప్రకటించింది. ‘శ్రీకాంత్ విజయాన్ని చూసి గర్వపడుతున్నాం. ఇది నిజంగా అమోఘం. దేశం గర్వ పడేలా చేయడమే కాకుండా.. ప్రపంచ అత్యుత్తమ క్రీడాకారుల్లో తానూ ఒకడినని శ్రీకాంత్ మరోసారి చాటి చెప్పాడు. అతన్ని పొగిడేందుకు మాటలు చాలడం లేదు' అని బాయ్ అధ్యక్షుడు హిమాంత బిస్వా పేర్కొన్నారు.
మహీంద్ర కారు.. బహుమతి
వరుసగా రెండో సూపర్ సిరీస్ టైటిల్‌తో సగటు భారతీయుడు గర్వపడేలా చేసిన శ్రీకాంత్‌కు ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర తమ కంపెనీకి చెందిన టీయూవీ 300 కారును బహుమతిగా ఇస్తామని తెలిపారు. అంతేకాదు ఆ కారుని తానే స్వయంగా అతనికి అందజేస్తానని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. క్రికెటర్లు అందుకునే మొత్తంతో పోల్చితే చాలా తక్కువని, టాప్ షట్లర్‌కు ఏదైనా ఇవ్వాలని ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌కు ఆనంద్ స్పందించారు. ‘ఓకే.. శ్రీకాంత్ పోరాటస్ఫూర్తి మనల్ని గర్వపడేలా చేసింది. స్టీమ్‌రోలర్‌కు ఒక యుద్ధ ట్యాంకర్ అవసరం. శ్రీకాంత్‌కు నా చేతుల మీదుగా టీయూవీ300ను అందిస్తాను' అని ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు.

శ్రీకాంత్ ఇంట సంబరాలు
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన శ్రీకాంత్ సొంతూరు గుంటూరులో తల్లి దండ్రులు సంబరాలు చేసుకున్నారు. ఇటీవలే ఇండోనేషియా ఓపెన్ నెగ్గిన శ్రీకాంత్ వారం రోజుల వ్యవధిలోనే మరో సూపర్ సిరీస్ టైటిల్ గెలవడంతో అతని తల్లి దండ్రులు కృష్ణ, రాధాముకుంద ఆనందంలో మునిగి పోయారు. మిఠాయిలతో ఆనందాన్ని పంచుకున్నారు.

పుల్లెల గోపీచంద్ ఇలా
'కోర్టులో శ్రీకాంత్ ప్రదర్శించిన పోరాటపటిమ అద్భుతం. మ్యాచ్‌లో పరిస్థితులకు తగ్గట్టుగా రెండో గేమ్‌లో అతడు తన వ్యూహాన్ని మార్చుకున్న తీరు ఆకట్టుకుంది. ఈ విజయం ప్రపంచ మేటి ఆటగాడిగా అతడి స్థాయిని పెంచింది. మొత్తానికి నాలుగు వారాల్లో ముగ్గురు భారతీయులు నాలుగు సూపర్ సిరీస్ టైటిళ్లు గెలవడం గొప్ప ఘనత. సాయి ప్రణీత్, ప్రణయ్, శ్రీకాంత్ బాగా ఆడారు' అని గోపీచంద్ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications