
న్యూఢిల్లీ: భారత్‌లో కొన్ని రోజులుగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇటీవల ప్రతిరోజూ లక్షకు పైగా కేసులు నమోదవుతూ మళ్లీ పాత రోజులను గుర్తు చేస్తుంది. దీనికి తోడు కరోనాలో ఒక వేరియంటైనా ఒమిక్రాన్ కూడా క్రమంగా విస్తరిస్తుంది. దీంతో ఆ ప్రభావం దేశంలో నిర్వహించే క్రీడా టోర్నీలపై పడుతుంది. పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు రంజీ క్రికెటర్లు కరోనాతో ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. దీంతో బీసీసీఐ ఆ టోర్నీనే వాయిదా వేసింది. అయితే తాజాగా ఈ మహమ్మారి బ్యాడ్మింటన్‌ను కూడా తాకింది. భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు ఆటగాడు సాయి ప్రణీత్‌కు కరోనా సోకింది.
న్యూఢిల్లీలో ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్న ఇండియా ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో పాల్గొనడానికి సాయి ప్రణీత్ అక్కడికి వెళ్లాడు. అయితే టోర్నమెంట్ నిబంధనల్లో భాగంగా నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో సాయి ప్రణీత్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా సాయి ప్రణీతే వెల్లడించాడు.
తనకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిందని, రెండు రోజులుగా దగ్గు, జలుబు లక్షణాలు కూడా ఉన్నాయని సాయి ప్రణీత్ తెలిపాడు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్లు చెప్పాడు. తాను కోలుకోవడనానికి కనీసం వారం పడుతుందని, త్వరలోనే మళ్లీ కోట్‌లోకి అడుగు పెడతానని ఆశాభావం వ్యక్తం చేశాడు. కరోనా సోకండంతో ఇండియా ఓపెన్‌కు సాయి ప్రణీత్ దూరం కానున్నాడు. కాగా 2019లో జరిగిన వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో సాయి ప్రణీత్ కాంస్య పతకాన్నిగెలుచుకున్న సంగతి తెలిసిందే.
మరో భారత ఆటగాడు, డబుల్స్ స్పెషలిస్ట్ ధ్రువ్ రావత్ కూడా కరోనా బారి పడ్డాడు. దీంతో అతడు కూడా ఇండియా ఓపెన్‌కు దూరమయ్యాడు. అంతేకాకుండా ఇండియా ఓపెన్‌లో పాల్గొనడానికి వచ్చిన ఇంగ్లండ్ బృందంలోని ఇద్దరు ఆటగాళ్లు కరోనా బారినపడ్డారు. దీంతో ఇంగ్లండ్ టీం.. ఇండియా ఓపెన్‌ను నుంచి నిష్క్రమించింది. కాగా ఈ టోర్నీలో మరో తెలుగు తేజం పీవీ సింధు కూడా పాల్గొంటుంది.
కాగా 2022 ఇండియా ఓపెన్ న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో ఈ నెల 11 నుంచి 16 వరకు జరగనుంది. ఇందుకోసం కఠిన కరోనా నిబంధనలను అమలు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ టోర్నీకి ప్రేక్షకులను అనుమతించడం లేదు. ఆటగాళ్లు, వారి సిబ్బందికి ప్రతి రోజు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు భారత బ్యాండ్మింటన్ సమాఖ్య వెల్లడించింది. కరోనా నెగెటివ్ రిపోర్టులు వచ్చిన వారిని మాత్రమే స్టేడియంలోకి అనుమతించనున్నారు.