
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన జీవితంలో ఎదుర్కొన్న పలు సంఘటనలను తాజాగా వివరించారు. సైబర్ నేరాలపై మహిళలు, పిల్లలను చైతన్య పరిచేందుకు తెలంగాణ మహిళా భద్రతా విభాగం అధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. జీవితంలో తాను కూడా ట్రోలింగ్, సైబర్ బుల్లియింగ్ వంటి వాటికి గురయ్యానని సింధు వెల్లడించారు. ఒకటి రెండు సార్లు కాదని చాలా సార్లు ఈ సమస్యలను ఎదుర్కొన్నట్టు ఆమె తెలిపారు.
అయితే ఆ సమయంలో తాను అధైర్యపడలేదని, చాలా ధైర్యంగా ఆ సమస్యలను ఎదుర్కొన్నట్టు చెప్పారు. ఇతర మహిళలు, పిల్లలు కూడా ఇటువంటి సమస్యలు ఎదురైనప్పుడు అధైర్య పడకూడదని సూచించారు. పోలీసుల సాయంతో సదరు నేరగాళ్లకు చెక్ పెట్టాలని సింధు ధైర్యం చెప్పారు. ఇటీవల కాలంలో ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగిపోయిందని దీంతో సైబర్ నేరాళ్లు కూడా పెరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ దారుణాలకు మహిళలు, చిన్న పిల్లలే ఎక్కువగా బలవుతున్నారని సింధు వాపోయారు.
కరోనా సమయంలో పిల్లలకు ఆన్‌లైన్ క్లాసులు ఎక్కువగా జరుగుతున్నాయని సింధు చెప్పుకొచ్చారు. అయితే ఈ ఆన్‌లైన్ క్లాసుల సమయంలో పిల్లలను తల్లిదండ్రులు నిరంతరం గమనిస్తూ ఉండాలని ఆమె సూచించారు. పిల్లలు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే, దానిని అధిగమించేందుకు వారిలో తల్లిదండ్రులు తగిన ధైర్యం నింపాలని సింధు తెలిపారు. సైబర్ మోసాలకు సైబర్ వారియర్లు, మహిళల భద్రతకు షీ టీమ్స్ ఉన్నాయనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. సైబర్ నేరాల బారిన పడిన వారు భయపడకుండా వెంటనే తమ సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సింధు సూచించారు. ఈ కార్యక్రమంలో సింధుతోపాటు ముఖ్య అతిథులుగా మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ స్వాతి లక్రా, ఐజీ బి సుమతి కూడా పాల్గొన్నారు.
ఒలింపిక్స్‌లో రెండు పథకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణి అయినా పీవీ సింధు ఇటీవల ఢిల్లీ వేదికగా జరిగిన ఇండియన్ ఓపెన్‌లో సెమీఫైనల్‌లోనే ఓడి నిరాశపరించింది. అయితే ఆ వెంటనే జరిగిన సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో విజేతగా నిలిచి అదరగొట్టింది. ఆ టోర్నీ ఫైనల్‌లో మాళవిక బన్సద్‌తో తలపడిన సింధు 21-13, 21-16 తేడాతో విజయం సాధించింది. 2019 గ్లాస్కో వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన తర్వాత సింధు మళ్లీ టైటిల్ గెలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.