హైదరాబాద్: ఒలింపిక్స్ ఫైనల్‌కు చేరిన భారత స్టార్ షట్లర్ సింధు బంగారు పతకం సాధిస్తుందని ఆమె తల్లి విజయలక్ష్మి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం ఓ మీడియా ఛానల్‌తో సింధు తల్లి విజయలక్ష్మి మాట్లాడుతూ.. 'సింధు బాగా ఆడాలని పొద్దున్నే గుడికి వెళ్లి దేవున్ని ప్రార్థించాం. మేం కూడా కొంత టెన్షన్ పడుతున్నాం' అని తెలిపారు. అంతేగాక, సింధు తమతో ఫోన్లో మాట్లాడిందని చెప్పారు.
'ఫైనల్లో గెలిచి నువ్వు(సింధు) తెచ్చే బంగారం కోసం భారతదేశం మొత్తం ఎదురుచూస్తోందని చెప్పాం. గేమ్ విషయంలో కోచ్ గోపీచంద్ చూసుకుంటారు. సింధులో ఏం టెన్షన్ లేదు, జాలీగా మాట్లాడింది. రాత్రి 2న్నరకు మాట్లాడాం. చాలా హ్యాపీగా ఉంది. బాగా ఆడానని చెప్పింది' అని చెప్పారు.
ఫోటో గ్యాలరీ : రియో దాకా సింధు
'సింధు చిన్నమ్మాయి. బ్యాడ్మింటన్ పై శ్రద్ధ ఉండటం వల్లే ఆమెను ప్రోత్సహించాం. ఆమెకు హైట్ ప్లస్ పాయింట్. కానీ, అదే కొన్ని సార్లు మైనస్ అవుతోంది. కింది నుంచి తీసే షాట్లలో కొట్టాలంటే ఇబ్బందవుతుంది. గోపీచంద్ ఈ సమస్యలను అధిగమించేలా శిక్షణ ఇచ్చారు. అందువల్లే ఈ విజయాలు' అని పేర్కొన్నారు.

'సింధు ఫిజికల్‌గా చాలా ఫిట్. సింధులో ఫిట్నెస్ కాన్పిడెన్స్ పెరిగింది. అయితే, ఫైనల్లో సింధు తలపడనున్న కెరలినా కూడా మంచి ప్లేయర్. సింధు బాగా ఆడితే విజయం తప్పకవరిస్తుంది. గోపీ గారు లోటుపాట్ల గురించి చెబుతారు' అని తెలిపింది.
'నేను వాలీబాల్ ప్లేయర్. ఆయన కూడా జాతీయస్థాయి క్రీడాకారుడు కావడంతో నన్ను రమణ భార్య అనే వారు. ఇప్పుడు సింధు మదర్ అని అంటున్నారు. ఆయనకు సెంటిమెంట్స్ ఎక్కువే కానీ, మ్యాచ్ చూస్తారు. అమ్మావారికి పూజలు చేయించడానికి వెళ్లారు.. సాయంత్రంలోగా వస్తారు. గోపీచంద్ అకాడమీలోనే మ్యాచ్ చూస్తున్నాం' అని సింధు తల్లి విజయలక్ష్మి తెలిపారు.
కాగా, గుడికెళ్లడం, ఆడటం, గెలవడం అనేది సింధు కుటుంబ సెంటిమెంటుగా తెలుస్తోంది. సింధు తల్లి కూడా ఇదే చెబుతున్నారు. సింధు ఏ టోర్నీలో ఫైనల్ కెళ్లినా ఆమె తండ్రి పీవీ రమణ రట్నాలమ్మ గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయిస్తారని చెప్పారు. ఇలా చేయడం వల్ల చాలాసార్లు సింధు ఆటలో గెలుపొందిందని తెలిపారు. ఇదొక సెంటిమెంటుగా మారిపోయిందని చెప్పుకొచ్చారు.
11ఏళ్ల నుంచే గోపీచంద్ వద్ద సింధు శిక్షణ తీసుకుంటోందని ఆమె తెలిపారు. ఫైనల్లో గోపీచంద్ చెప్పే మెళకువలతో సింధు విజయం సాధిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ, తెలుగు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, క్రీడాకారులు, ప్రముఖులు సింధు విజయం కోసం అభినందనలు తెలిపారని చెప్పారు. వారిందరి ఆకాంక్షను తీర్చేలా సింధు ఫైనల్లో విజయం సాధిస్తుందన్న నమ్మం ఉందని చెప్పారు.