
హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా గేమ్స్‌లో భారత షట్లర్ సైనా నెహ్వాల్‌కు చుక్కెదురైంది. మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్‌లో స్వర్ణ పతకం సాధిస్తుందనుకున్న సైనా నెహ్వాల్ కాంస్యంతో సరిపెట్టుకుంది. అయితే, ఈ మ్యాచ్‌లో సైనా పోరు అభిమానులను ఆకట్టుకుంది.
సోమవారం జరిగిన సెమీ ఫైనల్లో సైనా నెహ్వాల్ 17-21, 14-21 తేడాతో ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్(చైనీస్ తైపీ) చేతిలో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణికి తై జు యింగ్‌కు సైనా మధ్యలో గట్టి పోటీ ఇచ్చింది. ఇద్దరి మధ్య హోరాహోరిగా పోరు సాగింది.
సైనా పాయింట్లు సమం చేస్తూ వీరోచితంగా పోరాడింది. అయితే, అనవసర తప్పిదాల కారణంగా సైనా మ్యాచ్‌ను చేజార్చుకోవల్సి వచ్చింది. 19 నిమిషాల హోరాహోరీగా సారిగి మొదటి గేమ్‌ను సైనా 17-21తో ఓడిపోయింది. తొలి గేమ్‌లో పోరాడి ఓడిన సైనా నెహ్వాల్.. రెండో గేమ్‌లో మాత్రం తన ప్రత్యర్ధికి ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది.
ఆసియా 'సంరంభం' - పదహారు రోజుల సంగ్రామం
ఇక, రెండో గేమ్‌ను ఓ దశలో 14-14తో సమం చేసింది. అయితే, ప్రత్యర్థి సైనాకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. వరుసగా పాయింట్లు సాధిస్తూ తైజు యింగ్ 21-14తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. దీంతో వరుస రెండు గేమ్‌లతో పాటు మ్యాచ్‌ను చేజార్చుకుని ఆసియా గేమ్స్‌లో తొలిసారి ఫైనల్‌కు చేరే అవకాశాన్ని కోల్పోయింది.
పూర్తి అటాకింగ్ గేమ్ ఆడిన తై జు యింగ్ ఫైనల్ బెర్తును ఖాయం చేసింది. ఆసియా గేమ్స్ బ్యాడ్మింటన్ చరిత్రలో మహిళల సింగిల్స్‌లో భారత్‌కు దక్కిన తొలి పతకం ఇది. ఆసియా క్రీడల్లో 1982 దిల్లీ క్రీడల్లో పురుషుల సింగిల్స్‌లో సయ్యద్ మోదీ కాంస్యం గెలిచాడు. పీవీ సింధు-యమగూచిల మధ్య జరిగే మరొక సైమీ ఫైనల్లో మ్యాచ్ విజేతతో తై జు యింగ్ తలపడనుంది. తాజా పతకంతో ఆసియా గేమ్స్‌లో భారత పతకాల సంఖ్య 37కు చేరింది.