ముంబై: పరుగుల వీరుడు మిల్కా సింగ్, మహిళా బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్‌ల జీవితాల ఆధారంగా ఇప్పటికే చిత్రాలు రూపొందగా, ప్రస్తుతం మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజహరుద్దీన్, టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీల చిత్రాలు రూపొందుతున్నాయి.
కాగా, ఇప్పుడు మరో క్రీడాకారిణి జీవితం ఆధారంగా సినిమా తీయబోతున్నారు. ఆమే భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్. ఆమె జీవితం ఆధారంగా ఓ సినిమాని తెరకెక్కించేందుకు రంగం సిద్ధమైంది.

ఈ చిత్రానికి అమోల్ గుప్తె దర్శకత్వం వహించనున్నారు. త్వరలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్ర దర్శకుడు అమోల్ గుప్తెతో కలిసి తీసుకున్న కొన్ని ఫొటోలను సైనా తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
తన జీవితం ఆధారంగా తెరకెక్కబోతున్న చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆమె తెలిపారు. కాగా, అమోల్ గుప్తె ఇప్పటికే 'తారే జమీన్ పర్', 'స్టాన్లీ కా దాబా' చిత్రాలకు దర్శకత్వం వహించి మంచి గుర్తింపు పొందారు.
కాగా, ఇటీవల సైనా నెహ్వాల్ మాట్లాడుతూ.. తన పాత్రను దీపికా పదుకొనె చేస్తే బాగుంటుందని అభిప్రాయపడింది. అలాగే తన కోచ్ పాత్రను షారుక్ ఖాన్ చేయాలని కోరుకుంది.