
బర్మింగ్‌హామ్: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. బుధవారం ఇక్కడ టోర్నీ ప్రారంభం కాగా.. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ చాంపియన్, అయిదో సీడ్ సింధు 21-11, 21-17 తేడాతో మలేసియా క్రీడాకారిణి సోనియా చియాపై అలవోకగా గెలిచి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ప్రిక్వార్టర్స్ (రెండో రౌండ్)లో సింధు.. డెన్మార్క్ షట్లర్ లినె క్రిస్టఫర్సన్‌ను ఢీకొంటుంది.
పురుషుల సింగిల్స్‌లో మాత్రం భారత్‌కు ఆశించిన ఫలితాలు రాలేదు. అగ్రశ్రేణి క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌తో పాటు పారుపల్లి కశ్యప్ తొలి రౌండ్లోనే టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఇద్దరూ తమ స్థాయి ఆటను ప్రదర్శించలేకపోయారు. 8వ సీడ్ శ్రీకాంత్ 11-21, 21-15, 12-21తో అన్‌సీడెడ్ గుయెన్ నాట్ (ఐర్లాండ్) చేతిలో పరాజయం పాలయ్యాడు. ఇక కశ్యప్ 13-21, 20-22తో టాప్ సీడ్ కెంటో మొమొటా (జపాన్) చేతిలో పోరాడి ఓడాడు.
మహిళల డబుల్స్‌లో సిక్కిరెడ్డి-అశ్విని పొన్నప్ప జోడీ జోడీ తొలి రౌండ్లో 21-14, 21-12తో బెన్యప్ప-నుంతకర్న్ (థాయ్‌లాండ్) జంటను ఓడించింది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజు-చిరాగ్ శెట్టి జోడీ 21-7, 21-10తో నిఖర్ గార్గ్ (ఇంగ్లాండ్)-అనిరుద్ధ (భారత్) జంటను చిత్తు చేసింది.
ఆల్ ఇంగ్లండ్ ఆరంభానికి ముందు రోజు భారత బృందంలో ముగ్గురికి కరోనా సోకిందన్న వార్త కలకలం రేపిన సంగతి తెలిసిందే. భారత జట్టు కోచ్ మథియాస్ బూ కూడా మీడియా సమావేశంలో తెలిపారు. ఆ ముగ్గురూ ప్రణయ్, సమీర్ వర్మ, ప్రణవ్ చోప్రాలుగా తేలింది. అయితే ముందు వీరి శాంపిల్స్‌లో పాజిటివ్‌గా రాగా.. రెండోసారి పరీక్షల్లో మాత్రం నెగెటివ్ వచ్చింది. దీంతో వీరిని టోర్నీలో పోటీ పడేందుకు అనుమతించారు.