
బర్మింగ్‌హామ్: ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్‌లో ప్రపంచ చాంపియన్, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పోరాటం ముగిసింది. దీంతో టైటిల్ మరోసారి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. భారీ అంచనాలతో బరిలో దిగిన సింధుకు 8వ సారి కూడా నిరాశ తప్పలేదు. శుక్రవారం హోరాహోరీగా సాగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ సింధు 21-12, 15-21, 13-21తో నాలుగో సీడ్ నొజొమి ఒకుహర (జపాన్) చేతిలో పరాజయం పాలైంది.
68 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌లో ప్రదర్శించిన దూకుడు రెండు, మూడు గేమ్‌ల్లో కనబరచలేదు. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌లో సింధు తేలిపోయింది. 11-5తో ఆధిక్యంలోకి వెళ్లిన ఒకుహర వెనుదిరిగి చూడలేదు. గేమ్‌లో పుంజుకునేందుకు పాయింట్ల కోసం ప్రయత్నించిన సింధు.. షటిల్‌ను నెట్‌కు, కోర్టు బయటకు ఆడి మూల్యం చెల్లించుకుంది. 19-10తో మూడో గేమ్‌కు చేరువైన ఒకుహర.. 21-13తో మ్యాచ్‌ను గెలుచుకుంది.
సింధుపై ఒకుహర గెలిచి గతేడాది వరల్డ్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. సింధు ఓటమితో ఈ టోర్నీలో భారత్ పోరు పూర్తిగా ముగిసినట్టయింది. ఇప్పటి వరకు సింధు, ఒకుహర 17 సార్లు తలపడగా.. తొమ్మిదింట్లో సింధు, ఎనిమిదింట్లో ఒకుహర పైచేయి సాధించారు. ఇక మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో సిక్కిరెడ్డి- అశ్విని పొన్నప్ప 13-21, 14-21తో మిసాకి- అయాక (జపాన్) చేతిలో ఓడారు.
మహమ్మారి కరోనా వైరస్ ముప్పు నేపథ్యంలో పీవీ సింధు బ్రిటన్ నుంచి కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజుకు ఫోన్ చేసింది. ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్స్‌లో ఆడాలో వద్దో సూచించాలని కోరింది. టోర్నీలో ఆడాలని, అవసరమైన జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలని ఆమెకు మంత్రి సూచించారు. విదేశాలకు క్రీడాకారులను పంపించే ముందు పరిస్థితులన్నీ సమీక్షించాలని క్రీడా సమాఖ్యలను కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే.