రియో డీ జెనీరో : రియో ఒలింపిక్స్ లో గ్రూప్ స్టేజీలోనే ఇంటిబాట పట్టిన సైనా నెహ్వాల్ కు మరో షాక్ తగిలింది. ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ రేసులో ఉన్న సైనా.. కమిటీకి ప్రాతినిధ్యం వహించే నలుగురు అభ్యర్థుల జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. కాగా, కమిటీలో స్థానం కోసం తొలి నాలుగు స్థానాల్లో నిలవాల్సి ఉండగా.. 1,233 ఓట్లతో సైనా ఆరో స్థానంలో నిలిచింది.
ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ కోసం జరిగిన ఓటింగ్ లో.. రియో ఒలింపిక్స్ లో పాల్గొంటున్న అథ్లెట్లు అందరు ఓటింగ్ కు అర్హులు కాగా.. సైనాకు 1,233 ఓట్లు మాత్రమే దక్కాయి. ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ ఎన్నిక కోసం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల నుంచి 23 మంది క్రీడాకారులను ఎంపిక చేయగా.. అందులో సైనా ఒకరు. గత లండన్ 2012 ఒలింపిక్స్ లో సైనా కాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే.

ఒలింపిక్ క్రీడా సంగ్రామం సందర్బంగా.. గత 25 రోజులుగా ఈ ఓటింగ్ జరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఓటింగ్ మొత్తం పూర్తి కాగా.. ఎంపికైన అభ్యర్థులకు ప్రస్తుత ఒలింపిక్స్ కమిటీ సెషన్ నుంచి ఆమోద ముద్ర లభించాల్సి ఉంది. అనంతరం ఏడేళ్ల పదవీ కాలానికి గాను ఎంపికైన నలుగురు అభ్యర్థులు ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీకి ప్రాతినిధ్యం వహిస్తారు.
ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీకి ఎంపికైన నలుగరు అభ్యర్థుల్లో.. బీజింగ్ ఒలింపిక్స్ లో స్వర్ణ పతకం సాధించిన జర్మనీ అథ్లెట్ బ్రిటా హెయిదెమాన్ 1,603 ఓట్లతో అగ్ర స్థానంలో నిలవగా, దక్షిణ కొరియాకు చెందిన టేబుల్ టెన్నిస్ ప్లేయర్ సెవుంగ్ మిన్ ర్యూ 1,544 ఓట్లతో, హంగేరీకి చెందిన స్విమ్మర్ డానియెల్ గ్యుర్తా 1,469 ఓట్లతో, అలాగే ప్రపంచ రికార్డు హోల్డర్ పోల్ వాల్టర్ యెలెనా ఇసిన్ బయేవా1,365 ఓట్లతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.
మొత్తంగా 11,425 మంది అథ్లెట్లకు గాను 5,185 మంది అథ్లెట్లు ఒలింపిక్స్ కమిటీ ఓటింగులో పాల్గొన్నారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీలో కొనసాగుతున్న క్లాడియా బోకెల్, సుంగ్ మూన్, అలెగ్జాండర్ పోపోవ్, యుమికా రుయిజ్ స్థానాల్లో కొత్తగా ఎంపికైన అభ్యర్థులు భర్తీ అవనున్నారు. ఒలింపిక్స్ కమిటీ ఓటింగ్ లో పాల్గొనడానికి.. 2012 లండన్ గేమ్స్ లేదా రియో ఒలింపిక్స్ 2016 లో పాల్గొన్న అథ్లెట్లు ఇందుకు అర్హులుగా ప్రకటించింది ఒలింపిక్స్ కమిటీ.
ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ ఎన్నిక గురించి మాట్లాడిన థామస్ బాచ్.. ఒలింపిక్స్ క్రీడలకు అథ్లెట్లే గుండెకాయ లాంటి వారని అభిప్రాయపడ్డారు. కొత్తగా ఎన్నికైన అభ్యర్థులకు అభినందనలు తెలిపారు థామస్.