బెంగళూరు: భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ప్రస్తుత కోచ్, కర్ణాటక బ్యాడ్మింటన్ సంఘం (కేబీఏ) అధ్యక్షుడు విమల్ కుమార్‌పై ఫోర్జరీకి ప్రేరేపించడానే ఆరోపణపై కేసు నమోదైంది. 18 ఏళ్ల వయసున్న షట్లర్‌ను తప్పుడు వయస్సు ధ్రువీకరణ పత్రాలతో అండర్-15 విభాగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అనుమతించారన్న ఆరోపణలతో విమల్ కుమార్‌తోపాటు కేబీఏ కార్యదర్శి భాస్కర్ రాజ్‌పైనా కేసు నమోదైంది.
హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వీరిపై కేసు నమోదు చేశారు. ఈ ఇద్దరితోపాటు కేబీఏ ఆఫీస్ బేరర్లు ఇద్దరిని, ఆరోపణలెదుర్కొంటున్న డానియెల్ ఫరీద్ అనే షట్లర్ తండ్రి షాబాద్ ఫరీద్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు.

వారందరిపై మోసం, ఫోర్జరీ నాన్ బెయిలబుల్ నేరాల కింద్ కేసులు నమోదు చేశారు. ఆటగాడి తండ్రి షాదాబ్ ఫరీద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆటగాడిని వయస్సును ధ్రువీకరించుకోవడానికి పోలీసులు చర్యలు చేపట్టారు. బయోలాజికల్ వయస్సును నిర్ధారించడానికి అతన్ని బౌవురింగ్, మడివాల ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపించారు.
ఆటగాడికి 16, 17 ఏళ్ల వయస్సు ఉంటే అతనిపై జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తారు. అతని వయస్సు 18 ఏళ్లు, ఆ పైబడి ఉంటే అతన్ని అరెస్టు చేస్తారు. ఆ ఆటగాడి వయస్సు గురించి పోటీలో పాల్గొంటున్న ఆటగాళ్ల తల్లిదండ్రులు విమల్ కుమార్‌కు చెప్పారు. అయితే, ఆయన ఏ విధమైన చర్యలు కూడా తీసుకోలేదు. ఆ తర్వాత వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.