ఇంగ్లాండ్ గ్రేటెస్ట్ క్రికెటర్లలో జేమ్స్ ఆండర్సన్ ఒకడు


హైదరాబాద్: ఇంగ్లాండ్ గ్రేటెస్ట్ క్రికెటర్లలో పేస్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ఒకడని ఓవల్ టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ అన్నాడు. ఓవల్ వేదికగా భారత్‌తో జరిగిన ఆఖరి టెస్టులో ఇంగ్లాండ్ పేస్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ అరుదైన ఘనత సాధించాడు.

టెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించిన పేస్ బౌలర్‌గా ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ రికార్డుని బద్దలు కొట్టాడు. ఆఖరి టెస్టులో భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో మహమ్మద్ షమీ వికెట్ తీయడం ద్వారా మెక్‌గ్రాత్(563)ను అధిగమిస్తూ అండర్సన్ ఈ రికార్డు అందుకున్నాడు.

564 వికెట్లతో నాలుగో స్థానంలో జేమ్స్ అండర్సన్

దీంతో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో 564 వికెట్లతో జేమ్స్ అండర్సన్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీధరన్(800), ఆస్ట్రేలియాకు చెందిన షేన్‌ వార్న్‌(708), భారత్‌కు చెందిన అనిల్‌ కుంబ్లే (619) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.

ఇంగ్లాండ్ అత్యుత్తమ బౌలర్లలో ఒకడు

మ్యాచ్ అనంతరం అలెస్టర్ కుక్ మాట్లాడుతూ "ఆండర్సన్ అద్భుతమైన ఆటగాడు, సత్తా ఉన్న బౌలర్. ఇంగ్లాండ్ జట్టు ఉత్పత్తి చేసిన అత్యుత్తమ క్రికెటర్లలో జేమ్స్ ఆండర్సన్ ఒకడు. తన బౌలింగ్‌తో అతడు ఎన్నో అద్భుతాలు చేశాడు. అది మానసికంగా గానీ, శారీరకంగా కానివ్వండి" అని అన్నాడు.

స్లిప్‌లో క్యాచ్‌లను పట్టడం గౌరవంగా భావిస్తున్నా

"అతని బౌలింగ్‌లో స్లిప్‌లో క్యాచ్‌లను పట్టడం ఒక గౌరవంగా భావిస్తున్నా. నిజానికి, ఈ వారం అద్భుతంగా గడిచింది. ఇంగ్లాండ్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించినందుకు, మా జట్టు 4-1తో సిరీస్‌ గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. గొప్ప విజయంతో నిష్క్రమిస్తున్నా. ఈ మ్యాచ్‌ చివరి సెషన్‌దాకా సాగడం సంప్రదాయ క్రికెట్‌ గొప్పతనాన్ని చాటింది" అని తెలిపాడు.

నా కెరీర్‌లో గొప్ప విశేషాలున్నాయి

"నా కెరీర్‌లో గొప్ప విశేషాలున్నాయి. చేదు ఫలితాలూ ఉన్నాయి. ఇవన్నీ కూడా టెస్టు క్రికెట్‌ ఎంత క్లిష్టమో చెప్పాయి. స్టువర్ట్ బ్రాడ్‌తో నాది సుదీర్ఘ అనుబంధం. ఇద్దరం 12 ఏళ్లు జట్టుకు ఆడాం. నా రిటైర్మెంట్‌తో ఇకపై అతని బౌలింగ్‌లో నేను స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేయడం కుదరదు. క్యాచ్‌లు వదలడం జరగదు" అని కుక్ చెప్పుకొచ్చాడు.

Have a great day!
Read more...

English Summary

Record-breaking fast bowler James Anderson is England's all-time greatest cricketer, according to retiring batsman Alastair Cook. Anderson overtook Glenn McGrath as the most successful fast bowler in Tests with the final wicket of England's fifth-Test victory over India.