జట్టులో ఆడింది కోహ్లీ ఒకడే.. మిగిలినవారంతా...??


హైదరాబాద్: భారీ అంచనాలతో మొదలుపెట్టిన ఇంగ్లాండ్ సుదీర్ఘ పర్యటన ముగిసింది. ఇందులో టీమిండియా ఐదు టెస్టుల సిరీస్‌ను 1-4తో, వన్డే సిరీస్‌ను 1-2తో చేజార్చుకున్న భారత్‌కు 2-1తో టీ20 సిరీస్‌ గెలవడం మాత్రమే ఊరటనిచ్చే అంశం. బ్యాట్స్‌మన్‌గా 2014 సిరీస్‌లో విఫలమైన విరాట్‌ కోహ్లీ బలహీనతలనే అస్త్రాలుగా మలుచుకొన్న అండర్సన్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌ను ఈ సారి చక్కగా ఎదుర్కొన్నాడు. సిరీస్‌లో ఏకంగా 593 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

జట్టుకు ఏకవ్యక్తి సైన్యంగా మారిన విరాట్‌ కోహ్లీ తన అనుచరుల్లో మాత్రం అంతటి స్ఫూర్తిని నింపలేకపోయాడు. ఓటముల నుంచి తప్పించుకోలేకపోయాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ పర్యాటక జట్టుగా పేరు తెచ్చుకుంటామన్న కోచ్‌ రవిశాస్త్రి మాటలకు.. ఆటగాళ్ల ఎంపిక, ఆటతీరులో వారి వైఖరి, టెయిలెండర్లను ఔట్‌ చేయడంలో వైఫల్యాలు, పిచ్‌లను అంచనా వేయకపోవడం, అవకాశాలను అందిపుచ్చుకోకపోవడం, వెక్కిరించిన ఘోర ఓటములకు పొంతనే కనిపించ లేదు. మొత్తంమీద ఇంగ్లిష్ గడ్డపై బ్యాట్స్‌మన్‌గా సఫలమైన విరాట్‌ కోహ్లీ కెప్టెన్‌గా జట్టును నడిపించడంలో విఫలమైయ్యాడు.

కోహ్లీ ఆడగలడు.. మరి జట్టు సంగతి:

‘కోహ్లీ నెల రోజులు ఆడకపోయినా నిలబడగలడు, పరుగులు సాధించగలడని తెలుసు. ఇతర ఆటగాళ్లకు మాత్రం సాధన అవసరం. సన్నాహక మ్యాచుల్లో అత్యుత్తమ బౌలర్లు ఉండకపోవచ్చు. బ్యాట్స్‌మెన్‌, బౌలర్లకు ఆయా పరిస్థితుల్లో ఎలా ఆడాలో తెలుస్తుంది. ఓడిపోవడం కన్నా ఇదెంతో మంచిది' అని గవాస్కర్‌ అన్నాడు.

ధావన్ వద్దని చెప్పినా.. పూజారాను పక్కకు పెట్టి:

జట్టు ఎంపికలోనూ కెప్టెన్ కోహ్లీ పొరపాట్లు చేశాడు. కౌంటీ వైఫల్యాలను దృష్టిలో ఉంచుకొని టీమిండియాకు నయావాల్‌గా మారిన ఛెతేశ్వర్‌ పుజారాను తొలి టెస్టు ఆడించలేదు. అతడే ఈ సిరీస్‌లో 278 పరగులు చేశాడు. బౌన్సీ, స్వింగ్‌, పేస్‌ పిచ్‌లపై ఇలా వచ్చి అలా వెళ్లే శిఖర్‌ ధావన్‌ను నమ్ముకోవడమూ కొంపముంచింది. అతడి బ్యాటింగ్‌ శైలి వన్డేలకు నప్పుతుంది కానీ టెస్టులకు సరిపోదని గంగూలీ, సెహ్వాగ్‌, గవాస్కర్‌, మంజ్రేకర్‌ తదితరులు చెప్పిన మాటల్ని వినిపించుకోలేదు.

హార్దిక్‌ను అతిగా నమ్మడమే:

పూర్తి స్థాయి పరిణతి సాధించని, రంజీల్లో అంత అనుభవం లేని హార్దిక్‌ పాండ్యను అతిగా నమ్ముకోవడం విరాట్‌ కోహ్లీ కొంప ముంచింది. అతడు బ్యాట్‌తో 164 పరుగులు చేయగా ట్రెంట్‌బ్రిడ్జ్‌లో ఐదు వికెట్లు తీశాడు. ఇక చెప్పుకోవడానికి మరేమీ లేదు. ఆరో స్థానంలో ఆడాల్సిన ఆటగాడికి ఉండాల్సిన నైపుణ్యాలేవీ అతడు కనబరచలేదు. స్వింగ్ ‌బంతులకు తత్తరపడ్డాడు.

ఆటగాళ్లతో పాటు పిచ్‌లపైనా అవగాహన లోపం

కోహ్లీకి టాస్‌ కూడా కలిసి రాలేదు. దాంతో పాటు పిచ్‌లను సరిగ్గా అధ్యయనం చేసి అందుకు తగ్గట్టు ఆటగాళ్లను ఎంపిక చేయలేదు. టర్న్‌కు, బౌన్స్‌కు సహాయపడిన ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టులో రెండో స్పిన్నర్‌ను ఎంపిక చేయలేదు. ఇంగ్లాండ్‌ పిచ్‌లపై టీమిండియా పేసర్లు తమ శక్తికి మించి బాగా ఆడారు. ఇషాంత్‌ (18), బుమ్రా (16), మహ్మద్‌ షమి (14) వికెట్లు తీశారు. అయితే కీలక సమయాల్లో ఇంగ్లాండ్‌ టెయిలెండర్లను మాత్రం ఔట్‌ చేయలేకపోయారు. ఇక ప్రత్యర్థి స్పిన్నర్లు దుమ్మురేపిన సౌథాంప్టన్‌ టెస్టులో అశ్విన్‌ను ఆడించాడు. ఆ పిచ్‌ రవీంద్ర జడేజా లాంటి వారికి బాగా నప్పుతుందని ప్రముఖుల అంచనా.

Have a great day!
Read more...

English Summary

Team India lost the fifth and final Test against by 118 runs to be defeated by England by 1-4, thus bringing the curtains down on a tour which started as a golden opportunity but ended in a saga of disappointments.