సిరీస్ విజయానికి వారు అర్హులే: గంభీర్


హైదరాబాద్: భారత్‌పై టెస్టు‌లో సత్తాచాటిన ఇంగ్లాండ్ క్రికెటర్లు సిరీస్ విజయానికి అర్హులని వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఓవల్ వేదికగా మంగళవారం ముగిసిన ఐదో టెస్టులో 118 పరుగుల తేడాతో గెలుపొందిన ఇంగ్లాండ్ జట్టు ఐదు టెస్టుల సిరీస్‌ని 4-1తో చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. సిరీస్‌ సాంతం భారత్‌తో పోలిస్తే ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్స్‌ మెరుగ్గా బ్యాటింగ్ చేశారని కొనియాడిన గౌతమ్ గంభీర్.. సిరీస్‌ని అభిమానులు బాగా ఆస్వాదించారని చెప్పుకొచ్చాడు.

'ఐదు టెస్టుల ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్ పూర్తి స్థాయి ఆధిపత్యం చెలాయించింది. అందుకే వారు విజయానికి అర్హులు. భారత బ్యాట్స్‌మెన్ నిరాశపరిచినా.. బౌలర్లు చాలా బాగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు.. ఇంగ్లాండ్ పేసర్ల కంటే మెరుగ్గా రాణించారు. ఇక చివరి టెస్టులో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. కెరీర్ ఆరంభంలోనే పంత్ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. అనుభవం ఉన్న రాహుల్‌ ఇదే జోరుని టెస్టుల్లో కొనసాగిస్తాడని ఆశిస్తున్నా. మొత్తానికి ఆసక్తికరంగా సాగిన ఈ టెస్టు సిరీస్‌‌ని అభిమానులు బాగా ఆస్వాదించారు' అని గౌతమ్ గంభీర్ వెల్లడించాడు.

ఇంగ్లాండ్ పర్యటనను భారత్ ఓటమితో ముగించింది. ఐదు టెస్టుల సిరీస్‌ను 4-1 తేడాతో కోల్పోయింది. సిరీస్ ఓటమి పక్కా అయిపోయినా పోరాటంలో మాత్రం వెనుకంజ వేయలేదు. చివరి టెస్టులో అద్భుతమైన ఆటతీరుతో భారత బ్యాట్స్‌మెన్ పోరాటం ఆకట్టుకుంది. ముఖ్యంగా ఓపెనర్ కేఎల్ రాహుల్ (149), రిషబ్ పంత్ (114) అద్భుత బ్యాటింగ్‌తో ఇంగ్లాండ్‌ను వణికించారు.

ఓవర్‌నైట్ స్కోరు 58/3తో చివరి రోజు ఆట ప్రారంభించిన భారత్‌ను రాహుల్, పంత్ సెంచరీతో ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 204 పరుగులు జోడించి భారత శిబిరంలో ఆశలు రేపారు. ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధించాలని కలలుకన్న టీమిండియాకు ఇంగ్లాండ్ బౌలర్ రషీద్ చుక్కలు చూపించాడు. అనూహ్య రీతిలో రాహుల్‌ను రషీద్ పెవిలియన్ చేర్చాడు. కాసేపటికే పంత్ కూడా ఔటవడంతో భారత్‌కు ఓటమి ఖాయమైంది. ఈ మ్యాచ్‌లో ఓడినప్పటికీ.. రాహుల్, పంత్ అనేక రికార్డులు నెలకొల్పారు.

Have a great day!
Read more...

English Summary

A 4-1 series loss sounds like the Test series against England was extremely one-sided, but the Indian team did put up a good fight. Gautam Gambhir talks to TimesofIndia.com about how England were the deserving winners and what the positives for Team India were.